kudali

5, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రారంభం

  "వందేమాతరం"

     ఇది భారతజాతిని ఏకం చేసిన మహామంత్రం. ఏ శబ్దం వింటే తెల్లవాడి గుండెల్లో రైళ్ళు పరుగులెత్తాయో, ఏ పదం వింటే ప్రతి భారతీయుడి హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుందో, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయో ఆ మహా మంత్రమే "వందేమాతరం" 

     ఆరు దశాబ్దాల క్రితం జాతి జాతిని ఏక త్రాటిపై నడిపి స్వాతంత్ర్య ఫలాన్ని మనకందించింది ఈ మహా మంత్రమే. ఆరు దశాబ్దాల తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ మహామంత్రం తో దేశాన్ని హోరెత్తించాల్సిన సమయం ఆసన్నమైంది. సుసంపన్నమైన భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా తెల్లతోలు దొంగలు దోచుకున్నారు. చెరుకు రసాన్ని పిండుకుని పిప్పిని పారబోసినట్లుగా పిప్పి చేసిన దేశాన్ని మనకు వదలి వెళ్ళిపోయారు. పోతూ పోతూ వారి జబ్బులను మనకంటగట్టిపోయారు. అవి అవినీతి, కుట్రలు, కుతంత్రాలు పనికిమాలిన పరిపాలనా వ్యవస్థ, విద్యావ్యవస్థ, వారు వదలి వెళ్ళిన ఈ జబ్బులు 60 సంవత్సరాలు దాటినా మనం నయం చేసుకోలేకపోతున్నాం. మనం ఈ జబ్బులకు గురయ్యామన్న సంగతే మనకు తెలియకుండా పోయింది. గ్రీకు నగర రాజ్యాల గురించి సోక్రటీసు, అరిస్టాటిల్ వంటివారు ప్రస్తావించేనాటికే ఈ పుణ్యభూమిలో మహా మహా సామ్రాజ్యాలు విలసిల్లాయి. 14 విశ్వవిద్యాలయాలతో ప్రపంచానికే జ్ఞాన బిక్ష పెట్టిన మనం మెకాలే వంటి అజ్ఞాని ఏర్పాటు చేసిన విద్యావ్యవస్థలో పురుగుల్లా తారట్లాడుతున్నాం. కుళ్ళిన శవం లాంటి తెల్ల పాలనను బయట పారవేశామే కానీ ఆ శవం వదలి వెళ్ళిన కంపు మాత్రం వదిలించుకోలేకున్నాం. కుళ్ళిన శవం లాంటి బ్రిటీషు పాలనను పోరాటాలతో మన పెద్దలు వదిలించుకున్నారు. ఆ శవం వదలి వెళ్ళిన కంపును వదిలించుకోవాల్సిన అవసరం నేడు మనముందు వున్న సమస్య. ఈ దుర్వాసనలను వదిలించుకుంటేకానీ మన పూర్వవైభవాన్ని సంతరించుకోలేము. తెల్లపాలనను వదిలించుకోవడానికి మన పెద్దలు ఎంత కష్టపడ్డారో, ఎన్ని పోరాటాలు చేశారో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కంపును వదిలించుకోవాలంటే ఇప్పుడు కూడా మనం అన్ని పోరాటాలు, ఉద్యమాలు చేయక తప్పని పరిస్థితులు మనముందున్నాయి. ఈ చెత్తను వదిలించుకుని మనదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనది. అందుకే మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఉద్యమం భగ భగ మండుతూ వాడ వాడలా ప్రజ్వరిల్లాలని, ఆ వెలుగుల్లో నా తల్లి భరతమాత సగర్వంగా నిలబడి ప్రపంచానికే దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తూ "రెండవ స్వాతంత్ర్య పోరాటాన్ని" ప్రారంభిస్తున్నాను.

 "వందేమాతరం" 

                                                                                       -జై హింద్.